17, జూన్ 2012, ఆదివారం

పుస్తకాలు ..

    
 నాకు గుర్తున్నంతవరకు నేను  చదివిన మొదటిపుస్తకం 'ఏడు తరాలు'.బానిస బతుకుల గురించి 'అలేక్సే హేలే ' కళ్ళకు  కట్టినట్లుగా వర్ణించాడు..చాలా ఆసక్తిగా చదివినట్లు గుర్తు..

            చాలా రోజుల తరువాత మళ్ళీ 'నవీన్ ' రాసిన 'అంపశయ్య' చదివాను..మొదలుపెట్టిన దగ్గరనుండి పుస్తకం కింద పెట్టకుండా చదివిన పుస్తకం ఇదేనేమో..మనిషి మనసు లోతుల్లోని ఆలోచనలను,నిత్యం చలరేగే సంఘర్షణలను ,కోరికలను..అద్భుతంగా ,సహజాతి సహజం గా రాశాడు.

    తరువాత 'శ్రీ శ్రీ ' రాసిన 'మహాప్రస్థానం '..ఈ పుస్తకం గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసినది ఏమిలేకున్నా ..'శ్రీ శ్రీ' రాసిన మొట్టమొదటి కవిత 'కొంపెల్ల జనార్ధన రావు 'మీద ..చాలా ఆశువుగా వుంటుంది..

నాకు నచ్చిన /గుర్తున్న కొన్ని లైన్లు ..

తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం ..

సెలవంటూ ఈ లోకాన్ని వదలి ...

తలపోసినవేవీ కొనసాగాక పోగా...

 పరివేదన బరువు కాగా ..

అటుచూస్తే..ఇటు చూస్తే ఎవరూ 

చిరునవ్వూ చేయూతనివ్వక ...

మురికితనం కరుకుతనం నీ సుకుమారపు 

హృదయానికి గాయం చేస్తే ..

అటుపొతే ..ఇటుపోతే..అంతా అనాదరణతో ,అలక్ష్యంతో చూసి ..

ఒక్కన్ని చేసి వేధించారని ,బాధించారని ..

వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా నేస్తం ..

తలవంచుకు వెళ్ళిపోయావ నేస్తం ...

అంటూ సాగే ఈ కవిత చాలా ఆలోచింపజేస్తుంది ...

తరువాత నేను చదివిన పుస్తకం 'బాలగంగాధర తిలక్' అమృతం కురిసిన రాత్రి '.....ఈ పుస్తకం చదివినవారి మనసంతా  అనుభూతిమయం అని చెప్పక తప్పదు ..అంత బాగా వుంటుంది..కవిత్వాన్ని ఆస్వాదించేవారు తప్పక చదివి తీరవలసిన పుస్తకం..


తరువాత 'చలం' గారి పుస్తకాలు ..మైదానం ,మ్యూజింగ్స్ ,దైవమిచ్చిన భార్య ,ప్రేమలేఖలు ..వేటికవే ప్రత్యేకం..స్త్రీ స్వేచ్చ ,వ్యక్తిత్వం దృష్టిలో వుంచుకొని చలం తనదైన శైలిలో కావ్య ఖండికలను సృజించాడు..స్త్రీని వస్తువుగా చూడటాన్ని అసహ్యించుకుంటాడు ..అందుకే చలం స్త్రీ పక్ష పాతి గా పేరుతెచ్చుకున్నాడు..

కో.కు ,రావిశాస్త్రి,బుచ్చి బాబు పుస్తకాలు ఆప్పుడప్పుడూ ..అక్కడక్కడా ..చదివినట్టు గుర్తు ...


'వేమన్న ' రాసిన శతకాలు..శ్రీ కృష్ణుడి గీతా పారాయణం అప్పుడప్పడూ చదువుతూ ఉంటాను..నేను చదవాలని అనుకోని చదవలేక పోయిన పుస్తకాలు 'రంగనాయకమ్మ 'గారి పుస్తకాలు..ఆవిడ పుస్తకాలలో వుండే విపరీతమైన తర్కం నాకు అంతగా అర్థం కాక పోవడమే కొంత కారణం  కావచ్చు..

చాలా రోజుల తరువాత కార్టూనిస్టు 'మోహన్ ' గారు రాసిన పుస్తకం చదివా  ..చాలా బాగుంది..సమకాలిన కార్టూనిస్టుల గురించి ..కార్టూనిస్టుల జీవితాల గురించి చాలా చక్కగా వర్ణించాడు ..

పుస్తకాలు చదివే ఓపిక ,సమయం లేక పోవడం వల్ల మాగజైన్లు ,వీక్లీ లు ,బ్లాగులు,పిట్టకధలు  చదవడం అలవాటు అయింది..కాక పోతే ప్రయాణాలలో మాత్రం కచ్చితం గా పుస్తకాన్ని తీసుకొని బయలుదేరుతాను..

'మంచి పుస్తకం ..మంచి స్నేహితుడి వంటిది ' అని నమ్మే వాళ్ళలో నేనూ ఒకన్ని ....








20, మే 2012, ఆదివారం

ఆనందం..



చిన్న పిల్లలు    ఇష్టం  వచ్చినట్లు గెంతులు వేయడంలో  ఆనందం  ఉంది ..

ప్రపంచంలోని  బాధలన్నీ గాలికొదిలేసి ఆదమరచి  నిద్ర  పోవడం లో  ఆనందం ఉంది..

నచ్చిన  పని చేయడం  లో  ఆనందం ఉంది ..

ప్రపంచాన్ని  ఎదిరించ డం లో ఆనందం ఉంది..

ప్రశ్నించడంలో ఆనందం ఉంది..

కలగనడంలో ,వర్షంలో తడవడంలో,భావాలు వ్యక్తీకరించడంలో ,ఇష్టం వచ్చినట్లు ఉండడంలో ,గంభీరంగా ఆలోచించడంలో ,వెర్రిగా నవ్వడంలో ,అందాన్ని ఆరాదించడంలో ,కొత్తగా ఆలోచించడంలో ,నమ్మినదాన్ని ఆచరించడంలో ,వంటరి  తనంలో ,అడవుల్లో విహరించడంలో ,కొత్తవిషయాలు  నేర్చుకోవడంలో,మల్లెల సువాసనలో    ఆనందం ఉంది..

అప్పుడే మొలకెత్తిన  మొక్కను గమనించడంలో ,సంగీతంలో ,అందమైన  ప్రదేశాలలో ,భయం లేకపోవడంలో,చెట్టునీడలో ,అందమైన  సూర్యోదయంలో ,గమ్యం లేని ప్రయాణంలో ,ప్రయోగం చేయడం లో ..
నిన్ను నీవు తెలుసుకోవడం లో ఆనందం ఉంది..

12, ఏప్రిల్ 2012, గురువారం

ఈ మధ్య ..


ఈ మద్య ఎక్కువగా నా  పుస్తకాలు చదివే అలవాటును కొనసాగించాలని  కొన్ని పుస్తకాలను చదవడం  మొదలు పెట్టాను..కానీ ఎందుకో అంత ఇంటరెస్టు అనిపంచలేదు..కొన్ని వారపత్రికలు..వండర్ వరల్డ్ లాంటి పత్రికలు ఆసక్తి అనిపించాయి ..ఏల్చూరి గారు రాసిన పుస్తకంలొ కొన్ని ఆయుర్వేద చిట్కాలు బాగున్నాయి..ఇంకా ఓ హెన్రీ రాసిన కధలు చదువున్నాను ..బ్లాగులు చదవడం  కొద్దిగా తగ్గించాను..ఇంకా సేంద్రీయ  వ్యవసాయం గురించిన సమాచారం తెలుసుకుంటున్నాను..నా ఇంటర్నెట్టు అడిక్షన్ కొంత తగ్గించుకున్నాను ..  ప్రత్యేకించి జానపద గీతాలు వింటున్నాను..  ఎప్పటి లాగే  పగటి  కలలు కంటున్నాను..ఏదో మొదలు పెట్టాలని ..ఏదో చేయాలని  ఆరాట పడిపొతున్నాను  ..ఇంకా సమయం రాలేదని సరిపెట్టుకుంటున్నాను ...అంతా గజిబిజి గా గందరగోళం గా వుంది ..ఎదో నాలుగు లైనులు గబ గబా గీకి నా బాధను తగ్గించుకొవాలని ఎందుకో అనిపించింది ..అంతే..  
   

9, ఫిబ్రవరి 2012, గురువారం

చలం 'ప్రేమలేఖలు'..

చలం 'ప్రేమలేఖలు' లో నాకు నచ్చిన కొన్ని పేరా గ్రాఫ్ లు.. 

*ఈవాళ ఎందుకో చాలా దిగులుగా ..నిరాశగా వుంది..అంతం ఏమిటి?..ఈ ప్రేమకంతా ..ఆనందానికంతా అంతం..వృద్దాప్యామూ..చావూ ..మరణమూ..ఈ జీవితం అంతం అన్న సంగతి ,ఈ లోకాన్ని విడిచిపోయే రోజు సంగతి తలచుకొంటే అంత విచారం కలుగుతుంది..ఏమి లాభం?..ప్రేమించి ..అనుభవించి ..ఆనందించి ..అవన్నీ బూడిద అయఎందుకే గదా?..ఎప్పుడూ అంతం లేకుండా ఇట్లా అందంగా బతకడానికి వీలేందుకు లేదో?..ప్రేమను మద్యలో తెంపే వాడు ..ఒకరిని చంపి ,ఒకరిని విడిచి పెట్టే వాడు ..పోనీ ముసలితనంలో నైనా ఈ జీవితాన్ని లయం చేసే వాడు ..
వాడు రాక్షసుడు..

*నన్ను చూసి ప్రజలు..వీడి బతుక్కి ..వీదికేందుకా ఇంత ఉత్సాహం ..ఈ పొగరు?దేన్ని చూసుకునా ?అన్నట్లు చూస్తారు..నా కళ్ళలో కాంతి,నా మొహం లో ఆనందం వాళ్లకు అర్థం కాదు..నా హృదయంతరాలం లో కనపడక వెలుగుతో ,నా మొహం లో కి తన కిరణాలు వేదజిమ్మే నీ ప్రేమే కారణమని వాళ్లకు ఏమి తెలుసు?..ప్రేమ రాజ్యాదిపతినైన నేను భౌతికంగా బంట్రోతునైతేనేమి?..బానిసనైతేనేమి? ..నా ఉత్సాహాన్ని దాచుకోగాలనా?..

నీ ముద్దులతో నిర్మలమైన మొహం లో కాంతి ఎట్లా మరుగు పడుతుంది?నీవలెను,నావలెను అంత గాడంగా ప్రేమించు కునేవారు కూడా ..ఒకరినొకరు సంపూర్ణం గా అర్ధం చేసుకోవడం ఎంత కష్టం? ..ఎంత విచిత్రమైన లోకం?..

*రాత్రి పది గంటలు..నా గుడిసె లో వంటరిగా కూర్చొని వున్నాను..రోజల్లా.విరామం లేకుండా వాన కురిసింది..ఇంకా కురుస్తోంది..బయట కటిక చీకటి..ప్రతి నిమిషం తన లోకి ప్రవహించే ఈ పట్టణపు మురికి వాన నీటిని ,కలుపుకోవడం ఇష్టం లేక పోట్లాడుతుంది నది..చలి..తలుపు దగ్గిరగా దీపం నీడలో కూర్చొని రాస్తున్నాను నీకు..కొంచం వైనూ ,నువ్వూ ..అంతే తక్కువ నాకు..పోనీ వైను వద్దులే ..వేడి కాఫీ చాలు..ఈ రాత్రికి రాకూడదా  నువ్వు?..

ఇన్ని సంగతులు ,విచిత్రాలు జారుగుతాయే..తప్పి జారి, పొరబాటున..ఇది జరగ కూడదా? ..అనుకొంటాను? ..అనేకమంది వస్తారు ..వెడతారు ..అనుకోని విషయం గా నువ్వు నా దగ్గరికి రావడం అనేది ఈ రాత్రి జరగకూడదా?..ఇన్ని అద్భుతాలు జరిగే ఈ లోకంలో ఇది అసంభవమా? 

నువ్వు నాకు చెప్పిన అరేభియాన్ నైట్స్ ..కధలో ఎవరో దేవతలు ..చైనా దేశపు రాకుమారిని ఒక రాత్రి హట్టాతుగా..బాగ్దాద్ రాజకుమారును పక్కలో పడుకోబెట్టి ,తెల్లవారే తీసుకుపోయినారు కదా?..ఆ దేవతలు ఈ కాలంలో లేరా?వుంది నా మీద కనికరించారా? ..

*ఈ వాళ పొద్దున నేను లేచి చూసేప్పటికి ,చక్కని,గుండ్రని చిలకలు రెండు నా శీతాఫలం చెట్టు మీద ,నేను నాకోసం బాగా పండాలని ఉంచుకున్న పెద్దపండును ఫలహారం   చేస్తున్నాయి..ఒక్కొక్క గింజే ..చేరోకసారీ ముక్కు ముంచి తీసుకుని చక్కగా కబుర్లు చెప్పుకొంటూ తింటున్నాయి ..నాకు కోపమొచ్చి తరిమేయ్యబోయి ఆగాను..

కూచొని అంతం లేని కబుర్లతో నన్ను కవ్వించే నువ్వు జ్ఞాపకం వచ్చావు..ఇద్దరం ఎన్ని గంటలు నది నీల్లవంక  చూస్తూ విసుగులేని కబుర్లు అర్థమూ ,అంతమూ లేకుండా చెప్పుకునేవాళ్ళం?..వాటికిట్లా పొద్దున కడుపులు నిండితే..ఇక రోజంతా హాయిగా ,కాంతిలో ,ప్రేమలో,అరుస్తో,చెట్లలో దాగుడుమూతలాడుతో ఆడుకోగలవు కదా?..
పోనీ వాటినన్న సుఖించనీ ..  

*ఇట్లా కొనడమూ..తీసుకు రావడమూ..దాచుకోవడమూ..వండుకోవడమూ..తినడమూ..ఇదంతా అసహ్యముగా ..అనవసరముగా తోస్తుంది..కొంచెం ఉన్నతమైన ఆనందం వారికి తోచినా ఈ చీదర నుంచి ప్రజలు బయట పడగలరనుకుంటున్నాను..వాళ్ళ సంగతి పోనీ ..నేను!ప్రస్తుతం నేనెట్లా తప్పించుకోగలను?పరిస్థుతులను ఈ బురదలో నాటి ,ఆత్మని మాత్రం ఆకాశం లో పెట్టి సృజించాడు దేవుడు..ఎంత క్రూరమిది?..

మృగాలు ,పక్షులు యెంత హాయిగా తిరుగుతున్నాయి..మనుషులకే వచ్చింది ఈ కష్టమంతా ..ఈ మృగాలకి,పక్షులకి కూడా ఈ మనుషుల వల్ల కష్టమే కదా ..తాము ఘనులమని ,కవులమని ,వీరులమని ,చక్రవర్తులమని,రానులమనీ,దేవతలమనీ విర్రవీగుతారే ..వారందరూ కూడా ఇలా జీవ రాశులను ముక్కలు చేసుకొని వండుకొని తినవలసినదేగా? మళ్ళీ దాంట్లో తగాదాలు ,మృగమనీ ,చెట్లు అనీ వంకలు,చివరికి ఉల్లిపాయ తినొచ్చు..తినగూడదని  నిషేదాలు!ప్రాణిని  ప్రాణి చంపి తినడం ఎట్లానూ తప్పదు..చంపడం,వండడం,ఆత్రుతతో నోట్లోకి దూర్చుకోవడం,ఆరగించుకోవడం ..మళ్ళీ బయటకి అసహ్యం గా మురికిగా తోసేసుకోవడం ఇవన్నీ తప్పదు కదా? ..ఏమి ఘనత వుంటుంది మనుషులకి? ..చక్రవర్తులైతేనేమి ?నవ నవ లాడే చెట్లనీ ,గంతులు వేసే మృగాలనీ
బలంగా ఎదిగే కాయల్నీ ,కళకళలాడుతో ఎగిరే పిట్టల్ని చంపి ,కోసి,పీకి తినడం తప్పక పోయిన తరువాత?..

(మిగతా తరువాత టపా లో..)  

25, జనవరి 2012, బుధవారం

మిఖాయిల్ తాళ్ :ఒక పరిచయం

తాళ్ మరణించాడన్న వార్త బాంబు లా వ్యాపించింది ..మిషా మరణించ కూడదు ..ఎందుకంటే రోజు వారీ జీవితం లో మిషా ది ప్రత్యేకమైన అందం ..ప్రత్యేకమైన తెలివి ..ప్రత్యేకమైన హాస్య చతురత..

ప్రపంచంలో చాలా మంది ఏదో ఒక కళకు అంకితమైపోతారు..ఆ కళ ను కొంత మందే ఆస్వాదిస్తారు..దానిలో ఉన్న ఆనందం కొద్ది మందికే తెలుసు..మిషా కి ఆ ఆనందం తెలుసు..చదరంగాన్ని మిషా ఆనందమయం చేశాడు..చదరంగం అతన్ని అనేక అనారోగ్య సమస్యలనుండి ..అసంత్రుప్తులనుండి దూరం చేసింది..

తాల్ ఒక అసాధారణ మనిషి ..ఒక అసాధారణ వ్యక్తిత్వం ..చదరంగాన్ని బొత్విన్నిక్ ఒక సైన్సు గా భావించాడు..కార్పోవ్  కేవలం ఆటగానే భావించాడు..కానీ తాల్ మాత్రం ఒక కళ గా స్వీకరించాడు..ఒక మెజీషియన్ గా చదరంగాన్ని శాసించాడు..అంతకు ముందు ఉన్ననియమాలు కాక ,తన ఎత్తులనే నియమాలు గా అంగీకరించేటట్లు గా చేశాడు..1950  దశకం లో ని ఆటగాళ్లకు తాళ్ ఒక ఆదర్శం..

ఈ దశకం లో బొత్విన్నిక్.స్మిస్లోవ్ లు చదరంగం లో రెండు పెద్ద తలకాయలు..చదరంగాన్ని ఒక పద్దతిగా ఆడేవాళ్ళు..
బ్రన్స్తేయిన్,కేరేస్ తమ అమోఘమైన తెలివి తేటలతో శిఖరాగ్ర స్థానం లో వున్నారు..పేత్రోసియన్ చదరంగాన్ని అందనంత ఎత్తులోకి తీసుకు వెళ్ళాడు..


ఎందరో మహామహులు ఉన్న ఈ ఆటలోకి తాళ్ ఒక పెను తుఫాన్ లా ,హరికేన్ లా దూసుకు వచ్చాడు..ఎత్తులను చేతితో కాక మంత్రదండం తో కదుపుతున్నడా అన్నంత మాయలో కి నెట్టివేసి 1957 ,58  సంవత్సరాల్లో సోవియెట్ చంపియన్ షిప్ ను గెలుచుకోవడమే కాకుండా 1961 లో ఏకంగా చదరంగ దిగ్గజం అయిన బొత్విన్నిక్ ను చిత్తు చేసి అతిపిన్న వయసులోనే (23 )ప్రపంచ చంపియన్ గా అవతరించాడు..

అది 1961 వ సంవత్సరం ..వందలాది చదరంగ ప్రియులు ఆట వీక్షించడానికి టికెట్టు దొరక్క హాలు బయటనుండే ఆటను వీక్షిస్తున్నారు..పుష్కిన్ థియేటర్ లో ని వాతావరణం అంతా కోలాహలం గా వుంది..పెద్ద తెరపై ఆటగాళ్ళు వేసే ఎత్తులను ప్రదర్శిస్తున్నారు..తాళ్ తన ఆరంభపు ఎత్తుల తరువాత వెంటనే ఒక గుర్రాన్ని త్యాగం చేశాడు..

బొత్విన్నిక్ కి ఇది ఒక చాలెంజ్..ఆట వీక్షిస్తున్న్ ప్రతి ఒక్కరూ తమ లెక్కలలోకి ,తర్కం లోకి దిగి పోయారు..ఏమీ  జరగనట్లుగా తాళ్ ఆట జరుగుతున్న స్టేజి వంక ప్రశాంతం గా చూస్తున్నాడు..బొత్విన్నిక్ అప్పటికే చదరంగం లో దిగ్గజాలైన కాపబ్లంక,లస్కర్ మరియు స్మిస్లోవ్ పై విజయాలను నమోదు చేసుకొని వున్నాడు..


తాళ్ తన గుర్రాన్ని బలి చేయాలన్న సాహసవంతమైన నిర్ణయాన్ని తప్పు అని నిరూపించడానికి బొత్విన్నిక్ కి చాలా తర్కం అవసరం అయింది..అట్టే సమయం లేదు..సుదీర్ఘమైన ఆలోచనా సముద్రంలో మునిగి గంభీరం గా వున్నాడు..


ప్రేక్షకులందరూ ఉద్వేగం గా వున్నారు..బొత్విన్నిక్ ఏ ఎత్తు వేస్తాడో నని కుతూహలం గా వున్నారు..ప్రాంగణం మొత్తం ఫుట్ బాల్ మైదానం లా కోలాహలం గా వుంది ..చివరికి బొత్విన్నిక్ కి తాళ్ వత్తిడి  కి తలొగ్గక తప్పలేదు..
ఈ మ్యాచ్ ని కోల్పోవడమే కాకుండా తన ప్రపంచ చంపియన్ హోదా ని తాళ్ కి కట్టబెట్టాడు..


ఆ తరం గ్రాండ్ మాస్టర్లకు తాళ్ విజయాల వెనుక రహస్యం కనిపెట్టలేక పోయేవారు..తాళ్ కి చదరంగం ఆడడం సులభం..మొజార్ట్ ఆటలో ఉన్నంత ఈజ్ అతని ఆటలో వుండేది..చాలా కొద్ది మంది ఆటగాళ్లకు మాత్రమె అతనిపై విజయాన్ని  నమోదు చేసిన రికార్డు వుంది ..

బల్ల పై తన ఆటను మెరుగు పరచ్కొనే తీరు ,అనుకోని విధంగా బలగాలను బలి పెట్టడం ,తీక్షణ మైన చూపు..తమ ప్రత్యర్డులు యిట్టే తప్పులు చేయడానికి పురిగొలుపుతుంది..ప్రశాంతం గా కదిపే తన ఎత్తుల వెనుక ఎంతో పోరాట పటిమ వుంటుంది ..తన బలగాలకు ,ఎత్తులకు అతీంద్రియ శక్తులు ఆవహిస్తాయి..బలగాలు రొమ్ము నిండా గాలి పీల్చుకొని యుద్దరంగం లోకి దూకుతాయి..అందుకే తాళ్ అంటే ప్రేక్షకులకు ఆసక్తి..అతడు పాల్గొనే tournament  ల లో తానే విజయం సాదించాలని కోరుకొంటారు..

తాళ్ యవ్వనం లో కూడా తన ఆరోగ్యం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు..జీవితం మొత్తం అనారోగ్యం తోనే కొనసాగింది..ఈ అనారోగ్యమే అతని అభివృద్దికి ఆటంకం గా మారింది ..బొత్విన్నిక్ తో తిరిగి నిర్వహించి న వరల్డ్ చాంపియన్ షిప్ మ్యాచ్ తాళ్ తన అనారోగ్యం కారణం గానే కోల్పోవలసి  వచ్చింది..అనారోగ్యం కారణం గా మ్యాచ్ ని వాయిదా వేసే అవకాశం ఉన్నా తాళ్ ఆ పని చేయలేదు..ఆసుపత్రిలో ఆపరేషన్ రూం లో ముసుగు వేసేంత వరకూ తాళ్ చదరంగం గురించి మాట్లాడుతూనే ఉన్నాడని డాక్టర్ తెలిపాడు..

                                               ఆసుపత్రి లో బాబి ఫిషర్ తో చదరంగం ఆట విశ్లేషిస్తున్నతాళ్ 

'Megician of Riga '  గా ముద్దు గా పిలుచుకొ బడే తాళ్ USA కి గాని USSR కి గాని వెళ్లి వుంటే ఎంతో పేరు ,డబ్బు గడించే వాడు..కానీ తన స్నేహితులందరూ రిగా లోనే వుండడం వాళ్ళ తాళ్ అటువైపుగా వెళ్ళలేదు..

Genius People అనేవాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు ..వాళ్ళు కాలం కంటే ముందు వుంటారు..తాళ్ చదరంగం లో తన కాలం లో అందరికంటే ముందు వుండే వాడు..చదరంగం ఆటలో అతని తెగింపు ,మెరుపుదాడి నేటి ఆటగాళ్లకు స్ఫూర్తి ..సాదారణ ఆటలో అసాదారణ మలుపులు తీసుకు రావడం ,ఆట ఏ మాత్రం ముందుకు వెళ్ళలేని పరిస్థులలో కూడా ఒడుపుగా బలగాలను బలిపెట్టి ఆటను కళ్ళు మిరిమిట్లుగోలిపే విధం గా ముందుకి తీసుకు వెళ్ళడం తాళ్ ప్రత్యేకత ..



తాళ్ ది 'short and sweet life '. స్నేహితుల దృష్టిలో 'great and simple life '.తాళ్  కి లెక్కకు మించిన స్నేహితులు
వుండేవాళ్ళు.కానీ ఏ నాడు ఎవరిని డబ్బు అడగలేదు..ఎవరిపైనా కోపం చోపించేవాడు కాదు..ఈ లక్షణాలు అతని వ్యక్తిత్వానికి రంగులు అద్దింది..అతని జీవితం,creative inspiration ఎంతో మందికి స్ఫూర్తి..


ఈ ప్రపంచం తాళ్ ను ఎప్పటికీ గుర్తు  చేసుకోంటూనే వుంటుంది ..ఎప్పటికీ తాళ్ ని కోల్పోయామన్న భావన లో వుంటుంది.. 





17, జనవరి 2012, మంగళవారం

జీవితం లో నీవు ఏమి సాదించావ్?

జీవితంలో ఎవరైనా ..ఏ సందర్బం లో నైనా ..జీవితం లో నీవు ఏమి సాదించావ్? అని అడిగితే ..ఒక్క నిమిషం వాళ్ళు అడిగిన ప్రశ్న ..అర్థం చేసుకొని ..నేనేమీ   సాదిం చలేదని  నెమ్మది స్వరంతో చెబుతా...నా నించి ఏదయినా జవాబు ఆశించి రెట్టించి అడిగి నన్ను తప్పక సమాధానం చెప్పవలసిన పరిస్థితి కల్పిస్తే ..ఎంతో కొంత డబ్బు సంపాదించి ఉండొచ్చు అని మళ్ళీ అంతే నెమ్మది స్వరం తో సమాధానం చెబుతాను ..

ఎంతో కొంత అంటే?

ఒక అర ఎకరం పొలం కొనుక్కునే అంత ...

అంతేనా?

నా తెలివితేటలకు ..కోరికలకు అది సరిపోతుంది..పైగా నా మీద ఆధార పడేవాళ్లు ఎవరూ లేరు ...

ఇంకా ఏమి సాధించావ్?

కొన్ని పుస్తకాలు  చదివినట్లు గుర్తు ..

ఏం పుస్తకాలు?

ఏదో శ్రీ శ్రీ ,చలం ,బాలగంగాధర తిలక్ ,కో కు ,బుచ్చిబాబు ,గోపి చంద్,ఆరుద్ర  రచనలు ..ఇంకా కొంతమంది రచయితల రచనలు అక్కడక్కడా..కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు ..కవితలు..

దీని వాళ్ళ నీకేమి వచ్చింది?

ఏదో కాస్తంత మనసుకు తృప్తి ..అంతో ఇంతో జ్ఞానం..కాస్తంత టైం పాసు..

ఇంకా..

చిన్నప్పుడు మా ఇంట్లో ఒక మామిడి మొక్క నాటాను ..ఆ చెట్టుకు నా పేరే ..బోల్డన్ని  కాయలు కాస్తుంది..

హ ..హ..హ..

మీరు  నవ్వుకోవచ్చు ..కానీ నామట్టుకు అదొక ప్రత్యేక జ్ఞాపకం తెలుసా?

ఆటల్లో పవేశం ఉందా?

కాస్తంత చదరంగం లో పవేశం వుంది ..ఒకసారి కాలేజి లో రెండవ బహుమతిగా చదరంగం బోర్డు ఇచ్చారు ..

అప్పుడప్పుడూ సరదాగా మా బావ గారితో ఆడుతుంటాను..


ఎవరైనా అమ్మాయిని ఇంప్రెస్ చేశావా?

లేదు..ఎందుకో అమ్మాయిలను దూరంగా చూడడమే నాకు బాగుంటుంది..అందాన్ని నేను ఆరాదిస్తాను..అంతవరకే..

వాళ్ళ జ్ఞానం పై నాకు అంత గురి లేదు..

అంటే..

అంటే..ఏమో..అంతే ..

ఇంకా ఏమి చేశావ్?

హుమ్మ్..పిచ్చి గా తెలుగు, ఇంగ్లీష్  బ్లాగులు చదువుతాను.. వ్యవసాయం పై కొంత ఆసక్తి ..ఇంటికి వెళ్ళినపుడు అంతో ..ఇంతో ..పనిచేస్తూ అమ్మా ,నాన్నకు సాయపడితే అంతో ,ఇంతో తృప్తి..

అంటే జీవితం లో ఏ విషయం లో నూ తమరు successful person కాదన్న మాట..

అస్సలు కాదు..అలా కావాలని అనుకోవడం లేదు..

అలా అనుకోవడం లోనే ఆనందం వుంది..



24, డిసెంబర్ 2011, శనివారం

జీవితం నేర్పే పాటాలు ..

*ఏ పని చేసే ముందు అయినా కాస్త ఆలోచించు..

*కాస్తంత ఓపికగా వుండు..

*ఇతరులను అపార్దం చేసుకొనే ముందు వారు అల్లా ఎందుకు ప్రవర్తించవలసి వచ్చిందో కొద్దిగా ఆలోచించు..

*నీ బలాలను, బలహీనతలను గుర్తించు..

*రోజూ కొంత నేర్చుకొంటూ నీ శక్తిని పెంపొందించుకో..

*అనవసర విషయాలను ఎక్కువగా ఆలోచించి సమయం వృధా చేయకు..

*మంచి హాబీ లను అలవరచుకో..

*కొత్త విషయాలను నేర్చుకో వాలన్న ఆసక్తిని ఎప్పటికీ ఉంచుకో..

*అవకాశం వచ్చినప్పుడు వదులుకోకు..

*బలహీనతలకు పూర్తిగా లొంగి పోకు ..

*ఏదయినా ఒక రంగంలో నిష్ణాతుడిగా అవడానికి ప్రయత్నించు ..

*నేను అన్న 'అహం' తగ్గించుకో..

*తప్పులనుండి నేర్చుకో...

*కలలు కను..వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించు..


*ఆపదలో ఉన్నవారికి నీవంతు సహాయం చేయి..


*సమస్యను తక్కువ అంచనా వేయకు..వాటిని పరిష్కరించే నీ సామర్ధ్యాన్ని కూడా తక్కువ అంచనా వేయకు..


*ఎదుటివారి మనోభావాలను కూడా గౌరవించు..


*మంచి నిర్ణయాలను తీసుకో..


*వివేకాన్ని పెంచుకో..


*సమయాన్ని సద్వినియోగ పరచుకో..


*తీవ్రమైన ప్రతికూల పరిస్తితులలో ,వత్తిడిలో కూడా ప్రశాంతంగా వుండు..


*చిన్న చిన్న ఆనందాలను ఎప్పుడూ కోల్పోకు..